: 2019 వరల్డ్ కప్ ఎలా కొట్టుకురావచ్చో అద్భుతంగా చెప్పినా... సెహ్వాగ్ కోచ్ కాలేకపోవడానికి కారణమిదే!


వీరేంద్ర సెహ్వాగ్... భారత క్రికెట్ జట్టులో ఒకప్పటి డ్యాషింగ్ ఓపెనర్. ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు మెంటార్ గానూ పనిచేశాడు. ఆపై భారత క్రికెట్ జట్టుకు కోచ్ కావాలంటే, ఒక లైను చెప్పాల్సింది చెప్పి దరఖాస్తు పంపి సంచలనం కలిగించాడు. తరువాత ఇంటర్వ్యూ జరుగుతుంటే, 2019లో జరిగే వరల్డ్ కప్ ను ఇండియా ఎలా నెగ్గుకు రావచ్చన్న విషయాన్ని దిగ్గజ త్రయం సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లకు అద్భుతంగా చెప్పాడు. అయినా కోచ్ కాలేకపోయాడు. వాస్తవానికి రవిశాస్త్రికన్నా ముందు సెహ్వాగ్ పేరే కోచ్ గా వినిపించింది. కానీ, చివరికి శాస్త్రి పేరు బయటకు వచ్చింది. ఇక సెహ్వాగ్ చివరిలో ఎందుకు వెనుకబడ్డాడన్న అనుమానాలు అందరిలో కలిగాయి. సెహ్వాగ్ ఎంపిక కాకపోవడానికి కారణం, తనకు కావాల్సిన సహాయక బృందాన్ని తీసుకోవాలన్న ఆయన ఆలోచనేనని తెలుస్తోంది.

తాను దరఖాస్తు చేసిన తరువాత, కొందరు బీసీసీఐ ప్రముఖుల నుంచి వచ్చిన సూచనల మేరకు, ప్రస్తుతం కెప్టెన్ గా ఉన్న కోహ్లీ సిఫార్సును కోరాడు సెహ్వాగ్. తొలుత, భారత క్రికెట్ కు మీరెంతో చేశారని పొగిడిన కోహ్లీ, కోచ్ పదవికి మీరు వస్తే, అభ్యంతరం లేదని కూడా చెప్పాడట. ఆపై ఫిజియో థెరపిస్టు అమిత్‌ త్యాగి, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సహాయ కోచ్‌ మిథున్‌ మన్హాస్‌ లను తన సహాయకులుగా చేర్చుకుంటానని సెహ్వాగ్ కోరడమే తప్పై పోయింది. వారి ఎంపికకు ప్రక్రియ ఉందని, ఆ పనిని సలహా సంఘం చూసుకుంటుందని అప్పటికి చెప్పిన కోహ్లీ, వారెవరూ వద్దని సలహా కమిటీకి చెప్పాడని, దీంతోనే సెహ్వాగ్ ను పక్కన బెట్టాల్సి వచ్చిందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News