: ఐటీలో ఉద్యోగం కోల్పోయారా?... మరేం పర్లేదు.. ఉచితంగా కొత్త టెక్నాలజీ నేర్చుకోండి!
ఇటీవల ఐటీ పరిశ్రమ మళ్లీ ఉద్యోగాల కోత మొదలుపెట్టింది. లక్షల్లో జీతం తీసుకున్న చేతులు ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్నాయి. ఇలాంటి వారి కోసమే బెంగళూరులో ప్రారంభమై కాలిఫోర్నియా వరకు విస్తరించిన సింప్లిలెర్న్ కంపెనీ ఓ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం ప్రారంభించింది. `బౌన్సింగ్ బ్యాక్ స్కాలర్‌షిప్` పేరుతో ఆన్‌లైన్ మాధ్యమంగా ప్రతిరోజు అప్‌డేట్ అవుతున్న కొత్త టెక్నాలజీలను ఉచితంగా నేర్చుకునే అవకాశం కల్పిస్తోంది.
ఉద్యోగం పోయిందని నిరాశ చెందకుండా మరో ఉద్యోగం సంపాదించడానికి వీలైన నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఈ ప్రోగ్రాంను రూపొందించినట్లు సింప్లిలెర్న్ సీఈఓ కృష్ణకుమార్ తెలిపారు. ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం ఇటీవల ఉద్యోగం కోల్పోయిన భారతీయులకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే ఇందులో చేరాలంటే ఇంతకు ముందు పనిచేసిన కంపెనీ జారీచేసే రిలీవ్ లెటర్ చూపించాల్సి ఉంటుంది. రూ. 9000 నుంచి రూ. 20,000 దాకా ఖర్చయ్యే కోర్సులను ఈ స్కాలర్‌షిప్ ద్వారా సింప్లిలెర్న్ సంస్థ ఉచితంగా అందజేయనుంది. ఒక్కరు ఒక్క కోర్సుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని కంపెనీ తెలిపింది.