: మహిళల ప్రపంచకప్: న్యూజిలాండ్‌తో నేడు చావో రేవో.. గెలిస్తే సెమీస్‌కు మిథాలీ సేన!


ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్‌లో తొలి నాలుగు మ్యాచుల్లో దుమ్ము రేపిన టీమిండియా తరువాత జరిగిన రెండు మ్యాచుల్లో చతికిల పడింది. వరుసగా రెండు మ్యాచ్‌లను కోల్పోయిన మిథాలీ సేన సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. దీంతో నేడు న్యూజిలాండ్‌తో జరగనున్న మ్యాచ్‌ను తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. కివీస్‌ను ఓడిస్తే టీమిండియా సెమీస్‌కు చేరుతుంది. లేదంటే మూటాముల్లె సర్దుకుని ఇంటికి పయనం కావాల్సి ఉంటుంది. మ్యాచ్‌కు ఒకవేళ వర్షం కనుక అడ్డుపడితే న్యూజిలాండ్ కంటే ఒక పాయింట్ ఎక్కువగా ఉన్న భారత్‌కు మరో పాయింట్ కలుస్తుంది. ఫలితంగా సెమీఫైనల్ బెర్త్ లభిస్తుంది.

ఇక తొలి మ్యాచుల్లో రెచ్చిపోయిన టీమిండియా బ్యాట్స్ విమెన్ తర్వాతి మ్యాచుల్లో పరుగులు రాబట్టడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా తొలి రెండు మ్యాచుల్లో ఇరగదీసిన స్మృతి మందన వరుసగా విఫలమవుతుండడం జట్టును వేధిస్తోంది. ఇక ఫీల్డింగ్ సమస్యలు కూడా జట్టు బలాన్ని దెబ్బతీస్తున్నాయి. కాగా, ఇప్పటికే ఆతిథ్య ఇంగ్లండ్, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు సెమీఫైనల్ చేరాయి. ఇక మరో జట్టు ఏదనేది నేడు తేలిపోనుంది. ఇక తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సర్వశక్తులు ఒడ్డేందుకు మిథాలీ సేన సిద్ధమవుతోంది. మరోవైపు న్యూజిలాండ్‌పై భారత్ గత చరిత్ర కూడా ఏమంత బాగోలేదు. ప్రపంచకప్‌లో కివీస్‌తో 11 సార్లు తలపడిన భారత్ తొమ్మిదింటిలో ఓడిపోయింది. ఒక మ్యాచ్ గెలవగా మరోటి టై అయింది. మరి నేటి మ్యాచ్‌లో టీమిండియా చరిత్రను తిరగరాస్తుందో? లేదో? వేచి చూడాల్సిందే.

  • Loading...

More Telugu News