: నోటీసులు ఇచ్చినంత మాత్రాన వారంతా తప్పుచేసినట్లు కాదు: ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా
టాలీవుడ్‌లో కలకలం రేపుతున్న డ్రగ్స్ వ్యవహారంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్పందించింది. ఈ రోజు మా అధ్యక్షుడు శివాజీ రాజా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. డ్రగ్స్ తీసుకోవడం అనేది మంచిది కాదని తెలుపుతూ తాము అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఈ వ్యవహారాన్ని మీడియా మరింత పెద్దదిగా చేసి చూపించకూడదని కోరారు. డ్రగ్స్ వ్యవహారం అనేది సినీ పరిశ్రమలోనే కాక ఐటీ, విద్యాసంస్థలు ఎక్కడ జరిగినా తప్పేనని అన్నారు. పోలీసులపై తమకు ఎంతో గౌరవం ఉందని అన్నారు.
సినిమా వారికి అధికారులు నోటీసులు ఇచ్చినంత మాత్రాన వారంతా తప్పుచేసిన వారు కాదని శివాజీ రాజా వ్యాఖ్యానించారు. నటుడు సుబ్బరాజు తనకు ఎటువంటి సంబంధం లేదని తనకు చెప్పారని అన్నారు. నోటీసులు అందుకున్న నటులకు తెలిసింది తెలిసినట్లు వాస్తవాలు అన్నీ పోలీసులకు చెప్పాలని తాము సూచిస్తున్నట్లు తెలిపారు. సినీ పరిశ్రమలోని వారు ఎటువంటి దాపరికాలు లేకుండా నిజాలే చెబుతారని ఆయన అన్నారు. ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సబర్వాల్ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్నారని ఆయన కితాబునిచ్చారు. సినీ పరిశ్రమలో చాలామంది డ్రగ్స్ తీసుకునేవారు ఉన్నారంటే తాము నమ్మబోమని చెప్పారు. ఎవరయినా తప్పు చేస్తే మాత్రం వారికి 'మా' నుంచి మాత్రం సహకారం అందదని అన్నారు.