: సౌరశక్తితో నడిచే మొదటి రైలును ప్రారంభించిన భారతీయ రైల్వే
గతేడాది రైల్వే బడ్జెట్‌లో రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించిన మేరకు సౌరశక్తితో నడిచే మొదటి డీఈఎంయూ (డీజిల్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్) ట్రైన్‌ను భారతీయ రైల్వే న్యూఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ స్టేషన్ నుంచి ప్రారంభించింది. ఇది ఢిల్లీలోని సరాయి రోహిలా స్టేషన్ నుంచి హర్యానాలోని ఫరూక్‌నగర్ స్టేషన్ల మధ్య నడవనుంది. ఒక్కోటి 300 వాట్‌పీక్‌ల శక్తిని ఉత్పత్తి చేయగల 16 సోలార్ పానెల్స్‌ను ఆరు కోచ్‌ల్లో ఏర్పాటు చేశారు.
మేకిన్ ఇండియాలో భాగంగా రూ. 54 లక్షల పెట్టుబడితో ఈ సోలార్ పానెల్స్ తయారు చేశారు. రైలు నడవడానికి ఒక గ్రిడ్ రూపంలో సోలార్ పానెల్స్‌ను అమర్చడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. త్వరలో దూర ప్రయాణాల రైళ్లను కూడా సౌరశక్తితో నడిచేలా చేస్తామని, ఇలా చేయడం ద్వారా భారతీయ రైల్వేకి సంవత్సరానికి రూ. 700 కోట్ల ఇంధన ఖర్చు తగ్గుతుందని భారతీయ రైల్వే ప్రత్యామ్నాయ ఇంధన సంస్థ సీఈఓ రవీందర్ గుప్త తెలిపారు.