: నేను ఆ రోజే ఊహించాను, నా పేరు ఉంటుందని, నోటీసులు వస్తాయని: నవదీప్


పోలీసు అధికారులు డ్రగ్స్ దందాలో భాగంగా తనకు నోటీసులు పంపుతారన్న విషయాన్ని ముందే ఊహించానని హీరో నవదీప్ వెల్లడించాడు. ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, తాను గతంలో కొన్ని కేసుల్లో ఇరుక్కున్నప్పటికీ, ప్రస్తుతం వాటన్నింటికీ దూరంగా ఉన్నానని, ఓ బాధ్యతాయుతమైన వ్యక్తిగా వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నానని చెప్పాడు. గత నెలలో తాను ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీతో అసోసియేట్ అయ్యానని గుర్తు చేసుకున్న నవదీప్, అందులో భాగంగానే తన మొబైల్ ఫోన్ వాళ్లతో ఉందని, తాను వాళ్లతో మాట్లాడటం, చాట్ చేయడం జరిగిందని, వారూ తన ఫోన్ వాడుకున్నారని చెప్పాడు.

ఆ తరువాత రెండు వారాలకు వారంతా డ్రగ్స్ కేసులో అరెస్టయినట్టు తనకు తెలిసిందని వివరించాడు. వాళ్లు నార్కోటిక్స్ కొనుగోలులో ఇరుక్కున్నారని తెలియగానే, తనకు పోలీసుల నుంచి కాల్ వస్తుందని అంచనా వేసుకున్నానని వెల్లడించాడు. విచారణకు పిలుస్తారని తెలుసునని, తన నిర్దోషిత్వానికి సంబంధించిన అన్ని ఆధారాలనూ సిద్ధం చేసుకునే ఉన్నానని అన్నాడు. విచారణకు స్వయంగా హాజరై, పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పి సహకరిస్తానని నవదీప్ స్పష్టం చేశాడు. దురదృష్టవశాత్తూ సదరు ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ ఎలా పని చేస్తుంది? అక్కడి వారు ఎలాంటివారు? అన్న విషయాలపై తనకు అవగాహన లేకపోయిందని అన్నాడు.

  • Loading...

More Telugu News