: ఆ ప్రయాణికురాలు తెచ్చిన మిక్సీ చూసి షాక్ తిన్న కస్టమ్స్ అధికారులు!
స్మగ్లర్లు తెలివిమీరిపోతున్నారు. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ అధికారులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండగా, వారి ఆటలను కస్టమ్స్ అధికారులు సాగనివ్వడం లేదు. తాజాగా విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారు మిక్సీని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. అబుదాబి నుంచి హైదరాబాదు వస్తున్న మహిళ 3 జార్ మిక్సర్ గ్రైండర్ ఒకటి తీసుకొచ్చింది.
అంత దూరం నుంచి మిక్సీ తీసుకురావాల్సిన అవసరం ఏంటో అర్ధం కాని అధికారులు దానిని విప్పి తనిఖీలు చేశారు. ఒక్కో పార్ట్ విడదీసిన తరువాత ఆశ్చర్యపోయారు. మిక్సీ మోటార్ లో జిగ్ అనే వైరింగ్ స్థానంలో బంగారాన్ని పోతపోసి, దానిపైన మెటల్ పూత పూసి మిక్సీగా అమర్చి తరలిస్తున్నట్టు గుర్తించారు. ఇలా తరలిస్తున్న 1.29 కేజీల బంగారం విలువ 45 లక్షల రూపాయలు ఉంటుందని గుర్తించారు. దీంతో ఆమెను అరెస్టు చేసి, ఆమెను మరింత లోతైన విచారణకు కస్టడీలోకి తీసుకున్నారు.