: 'దిలీప్ అరెస్టుతో షాక్ అయ్యా'నని అంటున్న భావన!
మలయాళ స్టార్ హీరో దిలీప్ అరెస్టుతో అందరిలాగానే తాను కూడా షాక్ కి గురయ్యానని సినీ నటి భావన తెలిపింది. కేసు పురోగతి నేపథ్యంలో ఒక ప్రకటన విడుదల చేసిన భావన... దిలీప్ పేరును ప్రస్తావించకుండా... పోలీసులు అరెస్టు చేసిన హీరోతో తాను చాలా సినిమాల్లో పనిచేశానని గుర్తుచేసుకుంది. ఆయనతో తనకు ఎలాంటి రియల్ ఎస్టేట్, ఆర్థిక వ్యవహారాలు లేవని తెలిపింది. కొన్ని వ్యక్తిగత సమస్యల కారణంగానే తమ మధ్య స్నేహబంధం ముగిసిపోయిందని తెలిపింది.
అరెస్టు అనంతరం దిలీప్ చెబుతున్నట్టు...ఆయన నేరం చేసి ఉండకపోతే నిజం తప్పకుండా బయటకొస్తుందని భావన తెలిపింది. అయితే ఈ కేసులో వాస్తవాలు త్వరగా బయటకు రావాలని, దోషులు తప్పించుకోకూడదని పేర్కొంది. అదే సమయంలో అమాయకులు శిక్షకు గురికాకూడదని చెప్పింది.
కాగా, ఫిబ్రవరిలో ఆమెపై లైంగిక దాడి అనంతరం పోలీసులు ఆమె పేరును వెల్లడించలేదు. 'ఒక మలయాళ నటి' అని మాత్రమే పేర్కొన్నారు. అయితే, ఆమె పేరును సోషల్ మీడియా ద్వారా నటుడు అజు వర్ఘీస్ ఉద్దేశపూర్వకంగా వెల్లడించాడు. దీంతో లైంగిక దాడి బాధితురాలి పేరును వెల్లడించిన నేరానికిగాను అతనిపై ఐపీసీ సెక్షన్ 228(ఏ) ప్రకారం కేసు నమోదు చేశారు.