: జగన్ నవరత్నాలను గులకరాళ్లతో పోల్చడం సరికాదు: వాసిరెడ్డి పద్మ
వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన నవరత్నాలతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిద్ర కరవైందని ఆ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు. ఈ నవరత్నాలు ఏపీ ప్రజల జీవనాడి అని చెప్పారు. ఈ అంశం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే అసెంబ్లీ, హైకోర్టులకు సంబంధించిన కొత్త డిజైన్లను చూపించారని ఎద్దేవా చేశారు. ఏ దేశానికి వెళ్తే ఆ దేశ డిజైన్లను చూపించడం చంద్రబాబుకు అలవాటేనని అన్నారు. గత మూడేళ్లుగా చంద్రబాబు చూపిస్తున్న గ్రాఫిక్స్ తో జనాలు విసిగిపోయారని తెలిపారు. చిన్నచిన్న ఇళ్లనే నిర్మించలేని ప్రభుత్వం... రాజధానిని ఎలా నిర్మిస్తుందో అర్థం కావడం లేదని అన్నారు.
చంద్రబాబుకు చంచాగిరి చేయడంతోనే ఆర్థిక మంత్రి యనమలకు సరిపోతోందని పద్మ విమర్శించారు. దొడ్డి దారిన ఆర్థిక మంత్రి అయిన ఆయనకు ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని... దానికి యనమలే కారణమని అన్నారు. జగన్ నవరత్నాలను గులకరాళ్లతో పోల్చడం దారుణమని మండిపడ్డారు. జగన్ హామీలను ప్రజలంతా మెచ్చుకుంటుంటే... వాటిని విమర్శించడానికి టీడీపీ నేతలకు మనసు ఎలా వచ్చిందని అన్నారు.