: పార్టీ ఒత్తిడి మేరకే కలెక్టర్ కు క్షమాపణలు చెప్పాను: ఎమ్మెల్యే శంకర్ నాయక్
మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనా విషయంలో తాను ఎటువంటి తప్పూ చేయలేదని, పార్టీ ఒత్తిడి మేరకు ఆమెకు క్షమాపణలు చెప్పానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. కలెక్టర్ తో అవమానకర రీతిలో ప్రవర్తించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ప్రీతిమీనాకు క్షమాపణలు చెప్పారు. అయితే, ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఆమె పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం పోలీస్ స్టేషన్ కు వెళ్లి శంకర్ నాయక్ లొంగిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత స్టేషన్ బెయిల్ పై విడుదలైన ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రీతిమీనా తన సోదరితో సమానమని, ఆమె, తాను ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లమని అన్నారు. తమ పార్టీలో కొందరు తనను టార్గెట్ చేస్తున్నారని వాపోయారు. తనపై కుట్ర చేసి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కు తన గురించి పూర్తిగా తెలుసని అన్నారు. కాగా, శంకర్ నాయక్ పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.