: సుదీర్ఘ కాలం తరువాత భార్యతో కలిసి కనిపించిన కిమ్ జాంగ్ ఉన్!
ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ వున్ సుదీర్ఘ కాలం తరువాత భార్యతో కలిసి సందడి చేశారు. ఖండాంతర క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంతో సంబరాలు నిర్వహించిన కిమ్ జాంగ్ ఉన్... ఈ వేడుకలకు సతీసమేతంగా హాజరయ్యారు. సాధారణంగా కిమ్ తన సతీమణి రి సోల్ జుతో కలిసి మీడియాకు కనిపించరు. వాస్తవానికి కిమ్ తండ్రి, తాతలు అధ్యక్షులుగా ఉన్న సమయంలో వారి సతీమణులు అసలు బయటకు కనిపించేవారు కాదు.
అయితే ఈ సంప్రదాయాన్ని పక్కన బెట్టి కిమ్ తన భార్యను అప్పుడప్పుడు మీడియా ముందుకు తీసుకొస్తుంటారు. వివిధ సందర్భాల్లో తన భార్యతో కలిసి ఆయన వేడుకల్లో పాల్గొంటుంటారు. గతంలో రెండు మూడు సార్లు కనిపించిన ఆమె తరువాత కనిపించలేదు. దీంతో ఆమె గర్భవతి అయి ఉంటుందని, అందుకే ఆమెను బయటకు కనిపించనీయడం లేదని పుకార్లు షికార్లు చేశాయి. అంతే కాకుండా కిమ్ కు తన భార్యతో విభేదాలు వచ్చాయని, అతని నుంచి ఆమె విడిపోవాలని అనుకుంటున్నారంటూ మరి కొన్ని పుకార్లు పుట్టుకొచ్చాయి. అవి చెవినబడ్డాయో ఏమో కానీ క్షిపణి ప్రయోగానంతరం నిర్వహించిన వేడుకల్లో కిమ్ భార్యతో కలిసి పాల్గొన్నారు. దీంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.