: చంద్రబాబు సూచనలు.. ఏపీ అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాకృతుల్లో మార్పులు
ఏపీ అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లు మారనున్నాయి. వజ్రాకారంలో అసెంబ్లీ, బౌద్ధ స్తూపం ఆకృతిలో హైకోర్టును నిర్మించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ మేరకు ఈ రోజు ఓ నిర్ణయం తీసుకున్నారు. నార్మన్ పోస్టర్ ప్రతినిధులు చూపించిన డిజైన్లలో చంద్రబాబు మార్పులు చేశారు. అసెంబ్లీ కోసం సిద్ధం చేసిన బౌద్ధ స్తూపం ఆకృతిని హైకోర్టుకు, హైకోర్టు కోసం సిద్ధం చేసిన వజ్రాకార డిజైన్ ను అసెంబ్లీకి మార్చాలని బాబు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, మార్పులు చేసిన హైకోర్టు డిజైన్ ను చీఫ్ జస్టిస్ కు చూపించి తుది డిజైన్లను సిద్ధం చేయాలని చంద్రబాబు సూచించారని చెప్పారు.
అసెంబ్లీ, సచివాలయం భవనాలను 250 ఎకరాల్లో నిర్మించనున్నట్టు చెప్పారు. అసెంబ్లీ భవనాలను ఆరు అంతస్తుల్లో 4.5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మిస్తారని అన్నారు. అసెంబ్లీ గ్రౌండ్ ఫ్లోర్ నాలుగు భాగాలుగా ఉంటుందని, గ్రౌండ్ ఫ్లోర్ లో అసెంబ్లీ, శాసనమండలి, పరిపాలనా ఛాంబర్లు .. ఉంటాయని చెప్పారు. ఇక, అసెంబ్లీ పైఅంతస్తులో స్పీకర్, మండలి చైర్మన్, సీఎం, ప్రతిపక్షనేత, మంత్రుల ఛాంబర్లు, మూడో ఫ్లోర్ లో లైబ్రరీ, మీటింగ్ హాల్ ఉంటాయని, మిగిలిన ఫ్లోర్లలో పరిపాలనా వ్యవహారాలు చూసుకుంటారని చెప్పారు.
కాగా, ఆరు లక్షల చదరపు అడుగుల్లో నిర్మించే హైకోర్టు భవనంలో మొత్తం నాలుగు ఫ్లోర్లు ఉంటాయని చెప్పారు. గ్రౌండ్ ఫ్లోర్ లో రిజిస్ట్రార్లు, ఇతర పరిపాలనా వ్యవహారాలు, మొదటి ఫ్లోర్ లో లైబ్రరీ, మీటింగ్ హాల్, పబ్లిక్ ఫెసిలిటీ హాలు, రెండో అంతస్తులో 16 కోర్టులు, సంబంధిత కోర్టుల జడ్జిలు ఉంటారని చెప్పారు. మూడో అంతస్తులో ఇరవై కోర్టులు, జడ్జిల ఛాంబర్లు, వెయిటింగ్ హాల్, నాలుగో అంతస్తులో చీఫ్ జస్టిస్ కోర్టు, చాంబర్లు, జడ్జిల మీటింగ్ హాల్స్ ఉంటాయని నారాయణ వివరించారు.