: అవును, బగ్దాదీ మరణించారు.. వారసుడ్ని ఎన్నుకుంటాం!: నిర్ధారించిన ఐఎస్ఐఎస్
ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వార్త ఎట్టకేలకు విడుదలైంది. ఐఎస్ఐఎస్ చీఫ్ అబు బకర్ అల్ బగ్దాదీ మృతి చెందాడని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ కీలక ప్రకటన చేసింది. ఐఎస్ఐఎస్ సంస్థకు చీఫ్ గా తనకు తాను ప్రకటించుకున్న అబు బకర్ అల్ బగ్దాదీ ఇరాక్, సిరియా దేశాలను హస్తగతం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ముస్లిం దేశాలన్నింటిలో ఖలీఫా రాజ్యస్థాపన జరగాలని, అందుకు యుద్ధమే సరైనదని ప్రకటించి దేశవిదేశాలకు చెందిన యువకులను, తీవ్రవాద భావజాలనికి ఆకర్షితులయ్యేలా చేయడంలో విజయం సాధించాడు. దీంతో ఒక్కో ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటూ, ఇరాక్ రాజధాని బాగ్దాద్‌కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోసుల్ పట్టణంలో 2014లో పాగా వేశాడు.
అక్కడి నుంచే సిరియా, ఇరాక్ లలోని వివిధ ప్రాంతాలను నియంత్రణలోకి తీసుకున్నాడు. దీంతో రంగంలోకి దిగిన అమెరికా, రష్యాలను నిలువరించేందుకు వివిధ దేశాల నుంచి తీవ్రవాద భావజాలం కలిగిన యువకులు, మతాన్ని విశ్వసించే యువకులు ఐఎస్ఐఎస్ ప్రాబల్యం కలిగిన ఇరాక్, సిరియాలకు రహస్యంగా వెళ్లేలా, అక్కడి సేనలతో పాటు అమెరికా, రష్యా సేనలను ఎదుర్కొనేలా పురిగొల్పాడు. 9 నెలల సుదీర్ఘ పోరాటం అనంతరం మృతి చెందాడు. కాగా, బగ్దాదీ మృతిపై చాలా కాలంగా పుకార్లు షికార్లు చేశాయి. అయితే అవి నిర్ధారణ కాలేదు. సాక్షాత్తూ ఐఎస్ఐఎస్ అధికారిక ప్రకటన చేయడంతో పాటు, ఆయన వారసుడ్ని త్వరలోనే ఎన్నుకుంటామని ప్రకటించడంతో ఆయన మృతినిర్ధారణ అయింది. మోసూల్ పట్టణాన్ని సంకీర్ణ సేనలు స్వాధీనం చేసుకున్న రెండో రోజు బగ్దాదీ మృతి చెందాడని ఐఎస్ఐఎస్ ప్రకటించింది.