: వరుణ్ సందేశ్ నన్ను బాగా చూసుకుంటున్నాడు.... నేనెందుకు ఆత్మహత్యాయత్నం చేస్తాను?: వితికా శేరు
టాలీవుడ్ నటుడు వరుణ్ సందేశ్ భార్య, సినీ నటి వితికా శేరు ఆత్మహత్యకు పాల్పడిందంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై ఆమె స్పందించింది. తాను ఆత్మహత్యకు పాల్పడలేదని స్పష్టం చేసింది. తనకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది. వరుణ్ సందేశ్ తనను చాలా బాగా చూసుకుంటున్నాడని తెలిపింది.
తన స్నేహితులతో కలిసి మాదాపూర్ కి డిన్నర్ కి వెళ్లానని... ఈలోగా తన పిన్ని, ఇతర స్నేహితులు ఫోన్ చేసి, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల గురించి చెబుతూ, 'సూసైడ్ అటెంప్ట్ చేశావా?' అని అడుగుతున్నారని, దాంతో ఆశ్చర్యపోయానని చెప్పింది. నిద్రమాత్రలు వేసుకుని నిద్రపోయినప్పుడు డోస్ ఎక్కువై ఆసుపత్రి పాలయ్యానని, ఆ ఫోటోలను పోస్ట్ చేస్తూ, తాను సూసైడ్ అటెంప్ట్ చేశానని, తనను ఆసుపత్రిలో చేర్చారని పుకార్లు రేపారని, నిజానికి తాను నిద్రపట్టకపోవడంతో నిద్ర మాత్రలు వేసుకున్నానని, ఒకటి వేసుకోవాల్సిన సమయంలో వేగంగా నిద్రపడుతుందని భావించి, నాలుగు వేసేసుకున్నానని, దీంతో నిద్ర పట్టేసిందని, తన తల్లి ఆందోళన చెంది ఆసుపత్రిలో చేర్పించిందని తెలిపింది. ఈ పుకార్లను చూసి చూసి సందేశ్, తాను నవ్వుకున్నామని ఆమె తెలిపింది.