: కుటుంబ సభ్యులను కోల్పోయిన లక్ష్మీ ప్రసన్నకు గ్రూప్-2 ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తండ్రి దుర్మార్గం కారణంగా కుటుంబాన్ని కోల్పోయిన లక్ష్మీప్రసన్నకు గ్రూప్-2 ఉద్యోగం ఇవ్వాలని సంబంధిత అధికారులను ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. చంద్రబాబు సూచన మేరకు జేసీ సోదరులు దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఆమెను అమరావతికి తీసుకువచ్చారు. లక్ష్మీప్రసన్నతో చంద్రబాబు మరోమారు మాట్లాడారు. ఆమె విద్యార్హతలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం, లక్ష్మీప్రసన్న మీడియాతో మాట్లాడుతూ, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి సహాయసహకారాలతో చంద్రబాబుని కలిశానని, గ్రూప్-2 కేడర్ జాబ్ ఇప్పిస్తానని చెప్పారని పేర్కొంది.
తనకు సాయం చేసిన చంద్రబాబుకు, జేసీ సోదరులకు .. ప్రతిఒక్కరికీ తన కృతజ్ఞతలు చెబుతున్నానని లక్ష్మీప్రసన్న చెప్పింది. కాగా, తాడిపత్రిలో వారం రోజుల క్రితం రామసుబ్బారెడ్డి అనే రైతు తన భార్య, ఇద్దరు కూతుళ్లను హతమార్చి, ఆయన ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ దారుణ సంఘటన నుంచి రామసుబ్బారెడ్డి పెద్దకూతురు లక్ష్మీ ప్రసన్న ఒక్కతే ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటనపై చలించిపోయిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బాధిత బాలికను ప్రభుత్వం తరపున ఆదుకుంటానని, సంరక్షకుడిగా, మార్గనిర్దేశకుడిగా ఉంటానని ఆ రోజు హామీ ఇచ్చారు.