: గ్రీన్‌కార్డ్ కావాలా?... ఇప్పుడు దరఖాస్తు చేయండి.. మళ్లీ 12 ఏళ్లకు రండి!
అమెరికాలో శాశ్వతంగా స్థిరపడాలంటే గ్రీన్‌కార్డ్ ఉండాల్సిందే. మరి ఆ గ్రీన్‌కార్డ్ రావాలంటే 12 ఏళ్లు ఎదురుచూడాల్సిందే. 2005లో గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఇప్పుడు గ్రీన్‌కార్డ్‌ల జారీ ప్రక్రియ నడుస్తున్నట్టు ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. వీరంతా నైపుణ్యాలు గల ఉద్యోగస్తులేనని సర్వే తెలిపింది. అలాగని భారతీయులకు తక్కువ సంఖ్యలో గ్రీన్‌కార్డులు జారీ చేస్తున్నారా అంటే అదీ కాదు, ప్రతి ఏడాది గ్రీన్‌కార్డ్ జారీ అయ్యే వారిలో భారతీయులు అధిక సంఖ్యలో ఉన్నారని రిపోర్టులు చెబుతున్నాయి.
అమెరికాలో గ్రీన్‌కార్డ్ జారీ చేయడమనేది అంత సులువైన పనేం కాదు. సమయం పడుతుంది. అప్పటికీ హెచ్1బీ వీసా ఉన్నవాళ్లకు గ్రీన్‌కార్డ్ జారీ చేసుకుంటూ వెళ్లినా, రోజురోజుకీ పెరుగుతున్న దరఖాస్తుల వల్ల కొంత తాత్సారం జరుగుతోంది. గ్రీన్‌కార్డ్ వచ్చిన వాళ్లు ఐదేళ్లు కాగానే అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేస్తున్నారు. అలాగే అమెరికన్ జాతీయులను పెళ్లి చేసుకున్న విదేశీయులు మూడేళ్లకే పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీంతో దరఖాస్తుల రద్దీ మరీ పెరిగిపోతోంది. ఉద్యోగావకాశాలు, చదువు కారణాలతో అమెరికాకు వలసలు పెరుగుతున్నాయి. చదువు అయిపోగానే ఉద్యోగం తెచ్చుకుని అక్కడే స్థిరపడాలనే ఆలోచనతో చాలా మంది గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని సర్వేలో తేలింది.