: 'ఓటుకు నోటు' గురించి మాట్లాడనివ్వరు.. జగన్ కేసు గురించయితే మాట్లాడతారు!: రోజా
తనకు ఎంతో అనుభవం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. పదో తరగతి పదిసార్లు రాసి ఫెయిలైతే పది సంవత్సరాల అనుభవం ఉన్నట్లు కాదని, ఆ అనుభవం ఎందుకూ పనికిరాదని తెలుసుకోవాలని రోజా అన్నారు. చంద్రబాబు నాయుడిది కూడా ఇటువంటి అనుభవమేనని వ్యాఖ్యానించారు. ఈ రోజు తిరుపతిలో రోజా మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడికి ఎలాంటి అనుభవం ఉందో ప్రజలకి అర్థమైపోయిందని అన్నారు.
రాష్ట్రాన్ని తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేశ్ అడ్డంగా దోచుకుంటున్నారని రోజా అన్నారు. అబద్ధం చెప్పడం, వెన్నుపోటు పొడవడం వంటివి వైఎస్ కుటుంబంలోనే లేవని, ఇచ్చిన మాటపై నిలబడతారని అన్నారు. జగన్ ని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. జగన్ మీద కుట్రపూరితంగా కేసులు పెట్టి జైలుకి పంపించారని రోజా అన్నారు. అసెంబ్లీలో 'ఓటుకు నోటు' గురించి మాట్లాడితే స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు అస్సలు మాట్లాడనివ్వబోరని, అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మాట్లాడకూడదని అంటారని రోజా అన్నారు. అదే జగన్ కేసు విషయం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ గంటలు గంటలు మాట్లాడనిస్తారని అన్నారు.