: అద్దె రూపంలో రూ. 20 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారా? అయితే జీఎస్టీ కట్టాల్సిందే!
ఇళ్ల అద్దె రూపంలో ఏడాదికి రూ. 20 లక్షల లోపులో సంపాదించే వారు జీఎస్టీ కట్టక్కర్లేదని, అయితే, ఆ మొత్తం మించితే కనుక జీఎస్టీ కట్టాల్సిందేనని రెవెన్యూ శాఖ ప్రకటించింది. నివాసానికి గానీ, షాపులకు గానీ అద్దె లేదా లీజుకి ఇచ్చి సంపాదించే మొత్తం రూ. 20 లక్షలు దాటకుంటే ఎలాంటి జీఎస్టీ చెల్లించక్కరలేదని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ ఆధియా తెలిపారు. అలాగే జీఎస్టీ పరిధిలోకి వచ్చే వారందరూ జీఎస్టీ నెట్‌వర్క్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుని సరైన సమయంలో పన్నులు చెల్లించి దేశాభివృద్ధికి సహకరించాలని హస్ముఖ్ కోరారు. ఇప్పటికే ఈ పోర్టల్‌లో సర్వీస్ టాక్స్, ఎక్సైజ్ సుంకం, వ్యాట్ విభాగాలకు చెందిన 69.32 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారని జీఎస్టీ నెట్‌వర్క్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రకాశ్ కుమార్ తెలిపారు. జీఎస్టీ నెట్‌వర్క్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్, కేన్సిలేషన్, ఎడిట్ వివరాలన్నీ పోర్టల్‌లో క్షుణ్ణంగా వివరించినట్లు హస్ముఖ్ చెప్పారు.