: సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో.. ఎనిమిది మంది విద్యార్థుల మృతి
యువతను సెల్ఫీ పిచ్చి పట్టిపీడిస్తోంది. ప్రమాదకర ప్రదేశంలో సెల్ఫీ కోసం ప్రయత్నించిన ఎనిమిది మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కి చెందిన తొమ్మిది మంది విద్యార్థులు కమలేశ్వర్ ప్రాంతంలో ఉన్న వెనా డ్యాం వద్దకు వెళ్లి, వారిలోని ఒకరి పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్నారు. అక్కడి ఓ జలాశయంలో ఓ పడవలో ప్రయాణిస్తూ నీళ్లలోనే కేక్ కట్ చేద్దామనుకున్నారు. ఈ క్రమంలోనే సెల్ఫీ తీసుకుందామని పోజులిస్తున్నారు. అయితే, ఒక్కసారిగా వారంతా అందులో ప్రమాదవశాత్తు మునిగిపోయారు. ఆ తొమ్మిది మందిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆ పడవ వెనా డ్యాంలో ప్రయాణిస్తుండగా మునిగిపోయిందని అక్కడి అధికారులు తెలిపారు. సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేస్తూ పడవలో అందరూ ఒకవైపునకే వచ్చారని, దీంతో పడవ బ్యాలెన్స్ తప్పి ఒకవైపునకు ఒరిగి మునిగిపోయిందని చెప్పారు. పడవ నడుపుతున్న ఇద్దరు, మరో యువకుడు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చేశారని, మిగతా ఎనిమిది మంది మునిగిపోయారని చెప్పారు. మొన్న జరిగిన ఈ ఘటనలో నిన్న సాయంత్రం ఏడుగురి మృతదేహాలను వెలికితీశామని, ఈ రోజు ఉదయం మరో మృతదేహాన్ని వెలికితీశామని సంబంధిత అధికారులు చెప్పారు.