: శిల్పా మోహన్ రెడ్డి అనుచరుడి ఇంటిపై పోలీసుల దాడి... రూ. 7 లక్షలు స్వాధీనం!
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ పడుతున్న శిల్పా మోహన్ రెడ్డి అనుచరుల ఇళ్లపై పోలీసుల దాడులు జరుగుతున్నాయి. ఈ ఉదయం ఆయన ముఖ్య అనుచరుడు, స్థానిక కౌన్సిలర్ సుబ్బారాయుడి ఇంట్లో సోదాలు జరిపిన పోలీసులు రూ. 7 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. విశ్వనగర్ లోని సుబ్బారాయుడి ఇంటికి ఈ ఉదయం వచ్చిన పోలీసులు, సోదాలు చేయాలని చెప్పి, తనిఖీలు నిర్వహించి, లెక్కలు లేవని ఆరోపిస్తూ, ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నారు.
కాగా, విషయం తెలుసుకున్న నంద్యాల చైర్ పర్సన్ సులోచన, శిల్పా వర్గీయులు టూ టౌన్ పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఎన్నికల్లో తమకు ఓటమి తప్పదన్న భయంతోనే అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ దాడులు చేయిస్తోందని వారు ఆరోపించారు.