: చతురత ప్రదర్శించిన గంగూలీ.... కోచ్ ఎంపిక కాస్త ఆలస్యం!
టీమిండియా దిగ్గజ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి తన చతురతను ప్రదర్శించాడు. భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నియమించిన క్రికెట్ అడ్వయిజరీ కమిటీ (సీఏసీ)లో సభ్యుడైన గంగూలీ తాజాగా టీమిండియా చీఫ్ కోచ్ ఇంటర్వ్యూలను నిర్వహించిన సంగతి తెలిసిందే. నిన్న అందర్నీ ఇంటర్వ్యూ చేసిన అనంతరం గంగూలీ మాట్లాడుతూ, కోచ్ ఎంపికకు మరింత సమయం అవసరమవుతుందని తెలిపాడు. ఇంటర్వ్యూలు ఆహ్లాదకర వాతావరణంలో జరిగాయని, గతంలోలాగే కోచ్ గా పని చేయాలనుకుంటున్న వ్యక్తులు తమ ప్రణాళికలు వివరించారని చెప్పారు.
వీరేంద్ర సెహ్వాగ్, రవిశాస్త్రి, లాల్ చంద్ రాజ్ పుత్, టామ్ మూడీ (ఆస్ట్రేలియా), రిచర్డ్ ఫైబస్ (సౌతాఫ్రికా) లు హాజరుకాగా, ఫిల్ సిమన్స్ మాత్రం గైర్హాజరయ్యాడు. వారికి లక్ష్మణ్, గంగూలీ ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించగా, సచిన్ స్కైప్ ద్వారా ఇంటర్వ్యూ చేశాడు. ఇంటర్వ్యూలు ముగిసిన అనంతరం కోచ్ పేరును ఇప్పుడే ప్రకటించడం లేదని, మరికొన్ని రోజుల సమయం ఇంకా అవసరం ఉందని ఆ ముగ్గురూ తెలిపారు. ప్రస్తుతానికి తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నామని చెప్పారు. ఈ సారి ఎవరిని కోచ్ గా ఎంపిక చేసినా 2019 వరల్డ్ కప్ వరకు ఆయనే కొనసాగుతారని గంగూలీ స్పష్టం చేశారు.
అలాగే తాను గానీ, బోర్డు కార్యదర్శి లేదా సీఈఓ గానీ మ్యాచ్ బరిలోకి దిగేవాళ్లం కాదని, తమకంటే ఆటగాళ్ల అభిప్రాయాలు ముఖ్యమని ఆయన చెప్పారు. అయితే అందరి ఆలోచనలు, అభిప్రాయాలు ఒకేలా ఉంటే బాగుంటుందని, భారత క్రికెట్ మేలు గురించి ఆలోచించే ఏ నిర్ణయమైనా తీసుకుంటామని దాదా తెలిపారు. ఎంపికతో తమ పాత్ర ముగిసిపోతుందని, అయితే జట్టును ముందుకు నడిపించాల్సిన బాధ్యత కెప్టెన్, కోచ్, ఆటగాళ్లది మాత్రమేనని గంగూలీ చెప్పారు. అదే సమయంలో కోచ్ లు ఎలా పని చేస్తారో కూడా కోహ్లీ అర్థం చేసుకోవాలని ఆయన చురకలంటించారు.