: జగన్ కొత్తగా ఇచ్చిన హామీలు ఏమీ లేవు: సీఎం చంద్రబాబు
జగన్ కొత్తగా ఇచ్చిన హామీలు ఏమీ లేవని, ఆ హామీలు అన్నింటిని ఇప్పటికే అమలు చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. నిన్న జరిగిన వైసీపీ ప్లీనరీలో ఆ పార్టీ అధినేత జగన్ ఇచ్చిన హామీల విషయం టీడీపీ ఎంపీలతో జరిగిన సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఆ హామీలన్నింటినీ ఇప్పటికే అమలు చేస్తున్నామని, లబ్ధిదారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
జగన్ తనపై ఉన్న కేసుల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి హామీలు ఇచ్చారని విమర్శించారు. నలభై ఏళ్ల నుంచి ఆచరణాత్మక రాజకీయాలు చేస్తున్నామని, తాము ఎవరితోనూ చెప్పించుకోవాల్సిన అవసరం లేదని, అసలు జగన్ వ్యాఖ్యలపై ఇంతకంటే ఎక్కువగా స్పందించాల్సిన అవసరం తమకు లేదని ఈ సందర్భంగా తమ పార్టీ ఎంపీలతో చంద్రబాబు అన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే నియోజకవర్గాల పునర్విభజన బిల్లు రానుందని, ఆరునెలల్లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తవుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.