: పాకిస్థాన్ నటులపై భావోద్వేగంతో స్పందించిన శ్రీదేవి!
ప్రముఖ సినీ నటి శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించిన ‘మామ్’ చిత్రం నాలుగు రోజుల క్రితం విడుదలైన విషయం తెలిసిందే. పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రంలో శ్రీదేవితో పాటు పాకిస్తాన్ నటీనటులు సజల్ అలీ, అద్నాన్ సిద్దిఖీ ముఖ్యపాత్రల్లో నటించారు. శ్రీదేవి కూతురు పాత్రలో సజల్ అలీ నటించింది. అయితే, ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న శ్రీదేవి భావోద్వేగం చెందటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
ఎందుకంటే.. పాక్ నటులపై భారత్ లో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ‘మామ్’ ప్రచార కార్యక్రమాల్లో అద్నాన్ సిద్దిఖీ, సజల్ అలీ పాల్గొనలేకపోయారు. ఈ నేపథ్యంలో శ్రీదేవి ఓ వీడియో విడుదల చేశారు. ‘మామ్’లో వారిద్దరు కీలకపాత్రలు పోషించారని ప్రశంసించిన శ్రీదేవి భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.