: ఇకపై విమానాల్లో శాకాహారం మాత్రమే... ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం
ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించే వారు ఇకపై శాకాహారానికి మాత్రమే పరిమితం కావాలి. దేశవాళీ సర్వీసులన్నింటిలో ఎకానమీ క్లాస్ లో ఇకపై శాకాహారాన్ని మాత్రమే అందిస్తామని, దీనివల్ల సాలీనా రూ. 7 కోట్ల నుంచి రూ. 8 కోట్ల వరకూ ఆదా అవుతుందని ఎయిర్ ఇండియా తెలిపింది. అంతర్జాతీయ సర్వీసుల్లో మాత్రం మాంసాహారాన్ని అందిస్తామని తెలిపింది. అప్పులు పెరిగిన వేళ, ఖర్చులను తగ్గించుకునేందుకు తీసుకునే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
కాగా, ప్రస్తుతం ఎయిర్ ఇండియా సుమారు రూ. 52 వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న సంగతి తెలిసింది. ఇక ఎయిర్ ఇండియాను వదిలించుకోవాలని భావిస్తున్న కేంద్రం, సంస్థలో మెజారిటీ వాటాలను విక్రయించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. కాగా, భోజనం నుంచి సలాడ్ ను తొలగించడం, శాకాహారం మాత్రమే వడ్డించడం వంటి చిన్న చిన్న చర్యల ద్వారా నష్టాలను ఎలా తీర్చుకోగలరన్న విమర్శలూ సంస్థపై వస్తున్నాయి. విమానాల్లో భోజనం చేస్తున్న వారిలో కేవలం 20 శాతం మంది మాత్రమే సలాడ్ తింటున్నారని ఇటీవల వెల్లడించిన ఎయిర్ ఇండియా, సలాడ్ ను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో పాటు ఇన్ సైట్ మేగజైన్ 'శుభ్ యాత్ర' కాపీలను సీటుకు ఒకటి కాకుండా, మొత్తం 25 కాపీలను మాత్రమే అందుబాటులో ఉంచాలని, దీని వల్ల విమానం బరువు తగ్గి ఇంధన సామర్థ్యం పెరుగుతుందని తెలిపింది.