: సీన్ రివర్స్: సహజీవనం చేసినందుకు యువతినే డబ్బులడిగారు!
ప్రేమించానని చెబుతూ, ఓ యువకుడు నమ్మించి మోసం చేసి, మూడేళ్లపాటు ఆమెతో సహజీవనం చేసి, ఆపై మొహం చాటేస్తుంటే, బాధితురాలికి అండగా నిలిచి, యువకుడికి బుద్ధి చెప్పాల్సిన ఓ పెద్దమనిషి, తమ వాడిని మూడేళ్లు వాడుకున్నందుకు మూడు లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాడు. హైదరాబాద్, ఎస్ ఆర్ నగర్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ అనాథ యువతి శ్రీనగర్ కాలనీలోని ఓ బట్టల దుకాణంలో సేల్స్ గర్ల్ గా పనిచేస్తోంది. అక్కడికి సమీపంలోనే ఉన్న ఓ బేకరీ షాపులో పనిచేస్తున్న రాజేష్ అనే యువకుడు ఆమెకు పరిచయం కాగా, అది ప్రేమగా మారింది.
వివాహం చేసుకుంటానని వాగ్దానం చేసిన రాజేష్, ఆమెను తీసుకుని ఎస్ఆర్ నగర్ లో మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. గత కొంత కాలంగా ఆమెను వేధిస్తూ, కొడుతూ ఉండటంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కల్పించుకోవడంతో, పెళ్లి చేసుకుంటానని మరోసారి చెప్పి వెళ్లిపోయాడు. ఆ సమయంలో రంగంలోకి దిగిన ఆ యువకుడి మేనమామ వచ్చి బాధితురాలి ఇంట్లోని సామానంతా లాక్కెళ్లిపోవడంతో పాటు, మూడు లక్షలు ఇవ్వాలని బెదిరింపులకు దిగాడు. దీంతో లబోదిబోమన్న సదరు యువతి మరోసారి పోలీసులను ఆశ్రయించింది. రాజేష్ మేనమామ పోలీసు డిపార్టుమెంట్ లోనే పనిచేస్తున్నట్టు సమాచారం. కేసును దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.