: ఐఎస్ఐఎస్ పై విజయం సాధించిన ఇరాక్... మోసూల్ స్వాధీనం!


ఉగ్రవాదులతో 8 నెలల సుదీర్ఘ పోరాటంలో ఇరాక్ సేనలు విజయం సాధించాయి. ఉగ్రవాద దాడులతో ప్రపంచాన్ని వణికించిన ఐఎస్ఐఎస్‌ పై ఇరాక్ సైన్యం తొలిసారి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మూడేళ్ళుగా ఐఎస్ఐఎస్ అధీనంలో ఉన్న మోసూల్ నగరాన్ని అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనల సాయంతో తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇరాక్ ప్రధాని, సాయుధ దళాల చీఫ్ కమాండర్ హైదర్ అల్ అబాదీ మోసూల్ పట్టణాన్ని నిన్న సందర్శించారు.

ఈ సందర్భంగా ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్‌ పై విజయం సాధించామని తెలిపారు. ఈ పోరాటంలో ఇరాక్ సేనలకు అండగా నిలిచిన సంకీర్ణ సేనలు, ఇరాక్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. మోసూల్ ను తమ అధీనంలో ఉంచుకునేందుకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తీవ్రంగా ప్రయత్నించారని, ఈ ప్రతిఘటలో ఎన్నో వ్యూహాలు అమలు చేశారని ఆయన చెప్పారు.

సంకీర్ణ సేనలు వచ్చే మార్గాల్లో బాంబులు అమర్చారు. అలాగే వాహనాల్లో సూసైడ్ బాంబర్లతో పేలుళ్లు జరిపారు. మహిళలను బంధించి సూసైడ్ బాంబర్లుగా ప్రయోగించేవారు, అన్నీ విఫలమయ్యేసరికి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే వారి పాచికలు పారకుండా అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు వారిని అష్ట దిగ్బంధనం చేసి, హతమార్చాయి. ఈ క్రమంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో పాటు పెద్దసంఖ్యలో ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు. బాంబుదాడుల్లో మోసూల్ నగరం పూర్తిగా ధ్వంసమైంది. చారిత్రక కట్టడాలను గతంలోనే ఉగ్రవాదులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ పట్టణ నిర్మాణానికి బిలియన్ డాలర్లకుపైగా ఖర్చవుతుందని అంచనా.

  • Loading...

More Telugu News