: పుణ్యాత్ముడికి, పాపాత్ముడికి తేడా ఇదే: వైకాపా కార్యకర్తల ముందు లక్ష్మీపార్వతి ఉద్వేగ ప్రసంగం
పుణ్యాత్ముడికి, పాపాత్ముడికి మధ్య వ్యత్యాసాన్ని గురించి చెబుతూ, వైకాపా నేత, దివంగత ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీ పార్వతి, వైకాపా ప్లీనరీ వేదికపై చేసిన ప్రసంగానికి కార్యకర్తల నుంచి మంచి మద్దతు లభించింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కనిపించడం లేదంటూ వార్త వచ్చిన తరువాత, రెండు రోజుల పాటు యావత్ తెలుగు ప్రజలు మంచి నీరు కూడా తాగకుండా టీవీలకు అతుక్కుపోయారని, ఆయన మరణ వార్త తెలిసిన తరువాత, ఆ బాధను తట్టుకోలేక 650 మంది చనిపోయారని గుర్తు చేసిన ఆమె, అలిపిరి వద్ద చంద్రబాబుపై దాడి జరిగి ఆయన చనిపోయారని తొలి వార్త వచ్చినప్పుడు, తిరుపతిలో 3 లక్షల మంది జనాభా ఉంటే, కనీసం 10 మంది కూడా చూసేందుకు రాలేదని చెప్పారు. పుణ్యాత్ముడైన వైఎస్ కు, పాపాత్ముడైన చంద్రబాబుకు అదే తేడానని చెప్పారు.
వైఎస్ ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో ఆశీర్వాద సూచకంగా చిరు జల్లులు కురిశాయని, మా దొంగల్లుడు, మాయదారి అల్లుడు ప్రమాణ స్వీకారం చేస్తుంటే, బియాస్ నదిలో 23 మంది కొట్టుకుపోయారని, ఈ రెండు వార్తలూ నాడు ప్రముఖంగా వచ్చాయని గుర్తు చేశారు. భగవద్గీతలోని శ్లోకాలు చెబుతూ లక్ష్మీ పార్వతి చేసిన ప్రసంగానికి వైకాపా కార్యకర్తల నుంచి చప్పట్లతో అభినందనలు వచ్చాయి. చంద్రబాబు పాలనలో వర్షాలు కురవడం లేదని అన్నారు. తాను గొప్పవాడినని చంద్రబాబు చెప్పుకుంటున్నారని, తనతో ఏదో పని చేయించుకునేందుకే వెంకన్న తనను బతికించాడని ఆయన ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ, ఇటువంటి పాపిష్టి వాడు పవిత్రమైన తన క్షేత్రంలో చనిపోతే, అక్కడ స్మారకం ఏర్పాటు చేస్తారు కాబట్టి, తన వద్దకు వచ్చే భక్తులు ముందుగా ఆ సమాధిని చూడటం ఇష్టంలేకనే వెంకటేశ్వర స్వామి చంద్రబాబును బతికించారని, ఈ విషయాన్ని వెంకన్నే స్వయంగా ఓ భక్తుడికి కలలోకి వచ్చి చెప్పారని అన్నారు.