: విశాఖ భూ స్కామ్ లో మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటాలకు సిట్ నోటీసులు
విశాఖ భూ కుంభకోణాలపై నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాఫ్తు బృందం మంత్రులు అయ్యన్నపాత్రుడితో పాటు గంటా శ్రీనివాస్ లకు నోటీసులు పంపనుంది. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వ సలహాదారు కుటుంబరావు స్వయంగా వెల్లడించారు. విశాఖపట్నం భూ కుంభకోణంలో ఆరోపణలు చేసిన వారు, తగిన ఆధారాలను చూపాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు ఆయన అన్నారు. ఈ విషయంలో ఆరోపణలు చేసిన అందరు రాజకీయ నాయకులకూ నోటీసులు పంపుతున్నామని, వారందరినీ సిట్ ప్రశ్నిస్తుందని కుటుంబరావు పేర్కొన్నారు.
పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దయినప్పటి నుంచీ 65 వేలకు పైగా రికార్డులు గల్లంతయ్యాయని, పాలనలో పారదర్శకత తీసుకురావాలన్న ఉద్దేశంతో రికార్డులను డిజిటలైజేషన్ చేస్తున్న క్రమంలో ఈ వ్యవహారం బయటకు వచ్చిందని కుటుంబరావు గుర్తు చేశారు. కాగా, భూ కుంభకోణంపై అయ్యన్నపాత్రుడు, గంటాలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్న సంగతి తెలిసిందే.