: అది సిలిండర్ పేలుడు కాదు... ఉగ్రదాడే.. వారలా చెబుతుంటే నోరు మూసుకున్నాం: అమర్ నాథ్ కు వెళ్లిన తెలుగు భక్తులు
గత బుధవారం నాడు అమర్ నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి జరుగగా, ఆ ప్రాంతంలోని స్థానికులు, పోలీసులు దాన్ని సిలిండర్ పేలుడుగా ప్రచారం చేశారని తెలుగు భక్తులు ఆరోపించారు. అనంతనాగ్ సమీపంలో ఈ ఘటనలో కామారెడ్డికి చెందిన ఓ భక్తుడు మరణించగా, పలువురికి గాయాలైన సంగతి తెలిసిందే. ఇక బతుకుజీవుడా అనుకుంటూ తిరిగి ఢిల్లీ చేరుకున్న తెలుగు యాత్రికులు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.
తామంతా ఆర్మూర్, హైదరాబాద్, కామారెడ్డి, కరీంనగర్ ప్రాంతాల నుంచి 47 మంది కలిసి యాత్రకు వెళ్లామని, 5వ తేదీన దర్శనం ముగిసిందని ఆనాటి ఘటన వివరాలు తెలిపారు. ఓ దాబా దగ్గర అల్పాహారం తీసుకుని, బయలుదేరుతుండగా, బాంబు దాడి జరిగిందని తెలిపారు. బస్సులోని సిలిండర్ పేలలేదని, అది అలాగే ఉందని తెలిపారు. అక్కడున్న వారంతా సిలిండర్ పేలుడని చెబుతుంటే, తాము నిజం చెబితే ఏమంటారోనని నోరెత్తలేదని వాపోయారు. 22 మంది తీవ్రంగా గాయపడ్డారని, పాదాల్లోకి గుండ్లు గుచ్చుకున్నాయని అన్నారు. ఇప్పటికీ మరో ఇద్దరు అనంతనాగ్ వద్ద ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నారని, వారి కోసం మరో ఐదుగురు ఆగిపోయారని తెలిపారు.