: పుతిన్ మాటలు... మెర్కెల్ చూపులు... నెట్ లోకం నవ్వులు!
జీ20 సమావేశాల్లో వాడివేడి చర్చలు జరుగుతాయని అందరికీ తెలుసు. అవి కాకుండా రెండు దేశాల అధినేతలు కలిసినపుడు ఏం మాట్లాడుకుంటారు అనే విషయం ఎవరికీ తెలియదు. వాళ్ల హావభావాలను బట్టి సమాచారం అంచనా వేసుకోవడమే మనం చేయగల పని. ఇప్పుడు ఇంటర్నెట్ లోకం అదే చేస్తోంది. హాంబర్గ్‌లో జరుగుతున్న జీ20 సమావేశాల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్, జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ ఏదో చర్చించుకుంటున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది.
జేబులో చేయి పెట్టుకుని సీరియస్‌గా పుతిన్ ఏదో చెబుతుంటే, అది వింటున్నపుడు మెర్కెల్ ముఖంలో పలికించిన హావభావాలు నవ్వు పుట్టిస్తున్నాయి. ఇక నెటిజన్లు ఊరుకుంటారా.. ఆ ముఖాభినయానికి తగ్గట్టుగా మాటలు సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే... పుతిన్‌కి జర్మన్ భాష వచ్చు కాబట్టి వారిద్దరూ జర్మన్ భాషలోనే మాట్లాడుకొని ఉండొచ్చని అంచనా.