: మెలానియా ట్రంప్ కు అనుమతి ఇవ్వని జర్మనీ భద్రతాధికారులు... అధికారిక కార్యక్రమాలకు దూరం
జర్మనీ వేదికగా జీ-20 సదస్పు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో జర్మనీలో జీ-20 సదస్సుకు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో జర్మనీ భద్రతాధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. అందులో భాగంగా అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ను కేవలం తన గెస్ట్ హౌస్ కు మాత్రమే పరిమితం చేశారు. షెడ్యూల్ ప్రకారం వివిధ దేశాధ్యక్షుల సతీమణులతోపాటు మెలానియా కూడా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది.
అయితే ఆందోళనకారుల నిరసనల నేపథ్యంలో ఆమెను భద్రతాధికారులు బయటకు అనుమతివ్వలేదు. దీనిపై మెలానియా ప్రతినిధి స్టీఫెన్ మాట్లాడుతూ, నిరసనకారుల ఆందోళనల నేపథ్యంలో స్థానిక పోలీసులు ఆమె బయటకు వచ్చేందుకు అనుమతినివ్వలేదని అన్నారు. దీంతో వాతావరణ శాస్త్రవేత్తల సారధ్యంలో జరిగాల్సిన ఒక కార్యక్రమంతో పాటు హేంబర్గ్ లో జరిగిన మరో కార్యక్రమానికి కూడా ఆమె హాజరుకాలేకపోయారని తెలిపారు.