: చైనాకు 283 వార్ షిప్స్, మనకున్నది 66 మాత్రమే... యుద్ధం వస్తే పరిస్థితి ఏమిటి?
భారత్, చైనాల మధ్య యుద్ధం వచ్చే అవకాశాలు లేనప్పటికీ, సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొన్న వేళ, ఎవరి బలం ఎంతని బేరీజు వేసుకోవడం సహజమే. ఈ నేపథ్యంలో జలయుద్ధం చేయాల్సి వస్తే, చైనాను నిలువరించడం భారత్ కు సాధ్యం కాదని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఎందుకంటే, భారత్ కన్నా చైనా వద్ద దాదాపు నాలుగు రెట్లు అధికంగా యుద్ధ నౌకలు ఉన్నాయి. వీటిని రంగంలోకి దింపితే, హిందూ మహాసముద్రంలో చైనాదే ఆధిపత్యం అవుతుంది.
భారత్, చైనా సముద్ర బలాన్ని పరిశీలిస్తే, మిసైల్ బోట్లు చైనా వద్ద 106 ఉండగా, ఇండియా వద్ద 25 మాత్రమే ఉన్నాయి. అటు నీటిలో, ఇటు నేలపై నడిచే ఆంఫిబియస్ షిప్స్ చైనా వద్ద 56 ఉండగా, ఇండియా వద్ద 9 ఉన్నాయి. ఫ్రిగేట్స్ విషయానికి వస్తే, చైనా వద్ద 52, ఇండియా వద్ద 14 ఉన్నాయి. డిస్ట్రాయర్లు చైనా వద్ద 26 ఉండగా, ఇండియా వద్ద 11 ఉన్నాయి. ఒక్క విమానాలను మోసుకెళ్లే ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ ల విషయంలో మాత్రం రెండు దేశాలూ సమానంగా ఉన్నాయి. ఇరు దేశాలకూ ఒక్కోటి చొప్పున మాత్రమే ఎయిర్ క్రాఫ్ట్ కారియర్లున్నాయి. చైనా మరోటి సొంతంగా తయారు చేసుకుంటుండగా, అది 2020 తరువాతే జాతికి అంకితమవుతుంది. ప్రస్తుతం తన దగ్గరున్న నౌకలతో సముద్రంపై ఆధిపత్యం చలాయించవచ్చేమోగానీ, భారత్ ను పూర్తిగా నిలువరించే శక్తి చైనాకు లేదన్నది రక్షణ రంగ నిపుణుల భావన.