: జీఎస్టీ ప్రభావం: తగ్గిన శాంసంగ్ బ్రాండ్ ఉత్పత్తుల ధరలు
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ బ్రాండ్‌కి ఇండియాలో ఎంతగా డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా శాంసంగ్ సంస్థ తమ టెలివిజన్లు, మైక్రో ఓవెన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, ఏసీల ధరలను తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 1 నుంచి అమలులోకి వచ్చిన జీఎస్టీ ప్రభావంతో ఇప్పటికే ఎల్జీ, పానాసోనిక్ సంస్థలు ఇండియాలో ధరలను తగ్గిస్తున్నట్లు పేర్కొన్నాయి. అదే బాటలో నడుస్తూ ముంబైలో ధరలను తగ్గిస్తున్నట్లు చెప్పిన శాంసంగ్.. ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లోనూ తగ్గించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అంతేగాక పలు ఉత్పత్తులపై ఎక్స్చేంజ్ ధరలను కూడా అందిస్తున్నట్టు సమాచారం. తాజాగా ఆ సంస్థ పేర్కొన్న ధరల వివరాల ప్రకారం... 22 అంగుళాల ఎల్‌ఈడీ టీవీ ధరను శాంసంగ్ 3 శాతం తగ్గించింది. దీంతో ఆ టీవీ ధర రూ.13,500కు తగ్గింది. ఇక 32 అంగుళాల టీవీ ధరపై 8 శాతం తగ్గించింది. దీంతో ఆ టీవీ ధర రూ.35,900కు చేరింది. అంతేగాక మిగతా అన్ని టీవీ మోడళ్ల రేట్లను, ఇతర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ధరలను కూడా తగ్గించింది.