: చంద్రబాబు ప్రశ్నకు అఖిలప్రియతో పాటు బిత్తరపోయిన మంత్రులు!
రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతి విషయాన్ని ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారో తెలిపే మరో ఘటన ఇది. వివరాల్లోకి వెళ్తే, నంద్యాల నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలో విజయాన్ని చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నియోజకవర్గం మారుమూల ప్రాంతాల్లో సైతం ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, పార్టీ నేతలలో చంద్రబాబు గెలుపు వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు భూమా అఖిలప్రియ, అమర్ నాథ్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, మాజీ మంత్రి ఫరూక్ లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా, గోస్పాడు మండలంపై ముఖ్యమంత్రి చర్చిస్తూ... టీడీపీకి అనుకూలంగా ఉన్న ఓ గ్రామ సర్పంచ్ పది రోజుల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని... దీనికి కారణం ఏమిటని ప్రశ్నించారు. దీంతో, అఖిలప్రియతో పాటు అక్కడున్న మంత్రులంతా బిత్తరపోయారు. మరికొందరు నేతల పేర్లను ప్రస్తావిస్తూ, వీరిలో కొందరు రెగ్యులర్ గా మీ వద్దకు వస్తున్నారని... మిగిలిన వారు అంత క్రియాశీలకంగా లేరని చంద్రబాబు చెప్పారు. పేర్లతో సహా చంద్రబాబు చెబుతుంటే సమావేశంలో పాల్గొన్న నేతలకు నోటి మాట రాలేదు. ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ, ఐదుగురు సర్పంచ్ లు, కొంతమంది ఎంపీటీసీలు టీడీపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
సమావేశం అనంతరం సహచర మంత్రులతో అఖిలప్రియ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఓపిక, పార్టీపై ఆయనకున్న పట్టు తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెప్పారు. నాన్న అడిగిన పనులన్నింటినీ ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారని... వీటన్నింటినీ పైనుంచి నాన్న చూస్తూ ఉంటారని సంతోషం వ్యక్తం చేసింది. నంద్యాలలాంటి నియోజకవర్గానికి వెయ్యి కోట్ల నిధులు రావడమంటే చిన్న విషయం కాదని... ముఖ్యమంత్రి చిత్తశుద్ధిని చూస్తుంటే తనకు ఇంకా కష్టపడాలని అనిపిస్తోందని చెప్పారు.