: తారస్థాయికి చేరిన జీతాల వివాదం... బోర్డును ధిక్కరిస్తూ సిరీస్ ను బహిష్కరించిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు
క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)తో ఆస్ట్రేలియా క్రికెటర్ల జీతాల వివాదం తారస్థాయికి చేరింది. వివాదం పూర్వాపరాల్లోకి వెళ్తే...ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించే (ఒప్పందం అమలులో ఉన్న) ఆటగాళ్లకు ఆదాయంలో 25 శాతాన్ని సీఏ పంచేది. ఈ ఒప్పందం జూన్ 30తో ముగిసింది. కొద్ది మందితో ఇంకా ఒప్పందం అమలులో ఉంది. ఈ నేపథ్యంలో సరికొత్త ప్రతిపాదనతో కొత్త ఒప్పందాన్ని తెరమీదకు తెచ్చింది. కొత్త ఒప్పందం ప్రకారం ఆదాయం మిగులులో కొంత భాగాన్ని సీనియర్, జూనియర్ ఆటగాళ్లకు పంచి, పురుష, మహిళా క్రికెటర్లకు జీతాలను కూడా పెంచాలని భావించింది. దీనికి క్రికెటర్ల సంఘం అంగీకరించకపోవడంతో వివాదం రాజుకుంది. దీంతో క్రికెటర్ల సంఘంతో సీఏ జరిపిన చర్చలు విఫలమయ్యాయి.
దీంతో దక్షిణాఫ్రికా పర్యటనను బహిష్కరిస్తున్నట్టు క్రికెటర్ల సంఘం ప్రకటించింది. ఈ పర్యటనలో ఆస్ట్రేలియా జట్టు టీమిండియా, సఫారీ జట్లతో ఆడనుంది. అదే సమయంలో దక్షిణాఫ్రికా-ఎ, ఆస్ట్రేలియా-ఎ, భారత్-ఎ మధ్య ముక్కోణపు వన్డే సిరీస్, నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ సిరీస్ ఈ నెల 12 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ వివాదం నేపథ్యంలో సిరీస్ జరుగుతుందా? లేదా? అన్నది అనుమానాస్పదంగా మారింది. ఈ వివాదం మరికొంత కాలం కొనసాగితే ఆగస్టులో బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్, సెప్టెంబరులో భారత్ లో వన్డే సిరీస్, ఏడాది చివర్లో యాషెస్ సిరీస్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటాయి. ఒకవేళ సిరీస్ రద్దైతే సీఏ ఈ జట్ల బోర్డులకు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.