: 20 కిలోమీటర్లు వెంటాడి...రెండు పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేసి.. చైన్ స్నాచర్స్ ను పట్టేసిన ఎస్సై!


సినిమా ఛేజింగ్ తరహాలో 20 కిలోమీటర్లు వెంటాడి చైన్ స్నాచర్లను పట్టుకున్న ఘటన వరంగల్ జిల్లా కేసముద్రం మండలంలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే....కేసముద్రం మండలం ఇనుగుర్తి శివారు అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన మద్దికుంట్ల కౌసల్య రోడ్డుపై నడుస్తుండగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు ఆమెను చిరునామా అడిగారు. వారడిగిన చిరునామా చెప్పేంతలో ఆమె మెడలోనున్న మూడు తులాల బంగారు గొలుసు లాక్కుని మండల కేంద్రంవైపుగా పరారయ్యారు. దీంతో ఆమె మండలకేంద్రం ఎస్సై శ్రీనివాసరెడ్డికి సమాచారం ఇచ్చి, వారి ఆనవాళ్లు వివరించారు. అంతే, వెంటనే తన సిబ్బందితో రంగంలోకి దిగిన ఎస్సై వారికి ఎదురుగా వెళ్లారు.

ఇంతలో హెల్మెట్ ధరించిన ఒక వ్యక్తి, ముఖానికి ముసుగు ధరించిన మరో వ్యక్తిని గమనించి ఆయన వారిని అనుమానించి వెంబడించారు. దీంతో ఉప్పరపల్లి మీదుగా గూడూరు వెళ్తుండడంతో గూడూరు పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో వారు తెలివితేటలు ఉపయోగించి, తీగలవేణి దగ్గర రూట్ మార్చారు. దీంతో పెనుగొండ మీదుగా మహబూబాబాద్‌ వెళ్తున్నారని గుర్తించి...అక్కడి రూరల్ పోలీసులను అప్రమత్తం చేశారు. వారు వెంటనే రంగంలోకి దిగి పెనుగొండ సమీపంలో రోడ్డుకడ్డంగా జీపు పెట్టారు. దీంతో ముందు రోడ్డుకడ్డంగా పోలీసు జీపు...వెనుక సుమారు 20 కిలోమీటర్ల దూరం నుంచి వెంటాడుతున్న పోలీసు జీపు... ఇక తప్పించుకునే అవకాశం లేకపోవడంతో ఇద్దరూ దొరికిపోయారు. వారిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి కౌసల్యకు సంబంధించిన మూడుతులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News