: కోహ్లీ సేన అభిప్రాయాలను తెలుసుకునేందుకు వెస్టిండీస్ కు వెళ్లిన బీసీసీఐ సీఈవో
జూలై 10వ తేదీ తర్వాత టీమిండియాకు హెడ్ కోచ్ ను బీసీసీఐ ప్రకటించనుంది. ఈ విషయాన్ని క్రికెట్ అడ్వైజరీ కమిటీలో సభ్యుడైన సౌరవ్ గంగూలీ ఇప్పటికే ప్రకటించాడు. ఇప్పటికే కోచ్ ఎంపికపై పెద్ద కసరత్తే జరిగింది. అయితే, కోచ్ ఎంపికకు సంబంధించి ఆటగాళ్ల అభిప్రాయాలను కూడా తీసుకుంటే బాగుంటుందని బీసీసీఐ భావిస్తోంది. ఇదే విషయంపై కెప్టెన్ కోహ్లీ స్పందిస్తూ, తమను సంప్రదిస్తే ఆటగాళ్లందరం కలసి అభిప్రాయాన్ని చెబుతామని చెప్పాడు. ఆటగాళ్లందరిదీ ఒకే అభిప్రాయం ఉంటుందని తెలిపాడు.
ఈ నేపథ్యంలో బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ జమైకాకు వెళ్లారు. ఈ సాయంత్రం టీమిండియా ప్లేయర్లతో ఆయన భేటీ అయి, హెడ్ కోచ్ పై వారి అభిప్రాయాలను సేకరించనున్నారు. ప్రస్తుతం కోచ్ పదవి కోసం రవిశాస్త్రి, సెహ్వాగ్, టామ్ మూడీల మధ్య పోటీ నెలకొంది. అయితే, టీమిండియా డైరెక్టర్ గా పని చేసిన అనుభవం రవిశాస్త్రికి లాభించనుందని తెలుస్తోంది.