: 'యునైటెడ్' ఎయిర్ లైన్స్ మరో తప్పిదం... చంటి బిడ్డ తల్లికి విమానంలో మూడు గంటల నరకం!


ఇటీవల తమ విమానంలో సీటు ఖాళీ చేయలేదని ఆరోపిస్తూ, ఓ ప్రయాణికుడిపై దాడికి దిగి, రక్తం వచ్చేలా కొట్టి తీవ్ర విమర్శల పాలైన యునైటెడ్ ఎయిర్ లైన్స్ మరో తప్పు చేసింది. తనకు, తన బిడ్డకు టికెట్ కొనుక్కొని విమానం ఎక్కిన ఓ బిడ్డ తల్లికి మూడు గంటల పాటు నరకం చూపింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, షిర్లీ యమయూచీ అనే ఉపాధ్యాయురాలు బోస్టన్ లో జరుగుతున్న టీచర్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు తన 27 నెలల బిడ్డ తైజోతో కలసి వెళ్లాలని హవాయి నుంచి రాను, పోనూ టికెట్లు కొనుగోలు చేసింది. బిడ్డకు సీటు కోసం 1000 డాలర్లు చెల్లించిన ఆమె తిరుగు ప్రయాణం వేదనాభరితమైంది.

విమానం టేకాఫ్ కు సిద్ధమవుతున్న వేళ ఓ వ్యక్తి వచ్చి యమయూచీ బిడ్డ కూర్చున్న సీటు తనదని చెప్పాడు. ఈ సీటు తనకే కేటాయించారని ఆమె చెబుతున్నా వినలేదు. ఈ లోగా విమానంలోని అటెండెంట్ వచ్చి, విమానం నిండిపోయిందని చెబుతూ, ఆ వ్యక్తి భుజాలపై చేతులు వేసి సీట్లో కూర్చోబెట్టాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తన చిన్నారిని ఒళ్లోకి తీసుకుని, మూడు గంటల పాటు యమయూచీ కదలకుండా ఉండిపోగా, ఆమె కాళ్లు వాచిపోయాయి. జరిగిన విషయాన్ని ఆమె మీడియాకు వెల్లడిస్తూ, విమానంలో వాదించేందుకు తనకు ధైర్యం చాల్లేదని చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న ఎంతో మంది యునైటెడ్ ఎయిర్ లైన్స్ ను విమర్శిస్తుండగా, నష్ట నివారణకు దిగిన యాజమాన్యం, ఆమెకు నష్టపరిహారాన్ని ఇస్తామని ప్రకటించింది. తైజో బోర్డింగ్ పాస్ సరిగ్గా స్కాన్ చేయబడలేదని, ఈ కారణంగానే ఓ సీటు ఖాళీగా ఉందని కంప్యూటర్ చూపగా, ఆ సీటును వేచి చూస్తున్న ప్రయాణికుడికి ఇచ్చామని తెలిపింది.

  • Loading...

More Telugu News