: మరో కలకలం.. చాక్లెట్స్ రూపంలో డ్రగ్స్ సరఫరా.. 8,760 చాక్లెట్లు స్వాధీనం
తెలంగాణలో డ్రగ్స్ మాఫియా కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో, స్కూళ్లలో డ్రగ్స్ దందాను బయటపెట్టిన పోలీసులు తాజాగా నిజామాబాద్‌లోనూ ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. గంజాయితో తయారు చేసిన మధుమునక్కా చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా వ్యాపారం చేసుకునే ఆ వ్యక్తి పేరు శారద శరత్ కుమార్ అని పోలీసులు తెలిపారు. చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని సమాచారం అందుకున్న పోలీసులు ప్రణాళిక ప్రకారం వెళ్లి అతనిని చాకచక్యంగా పట్టుకున్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్ విషయంలో మరెంత మంది హస్తం ఉందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
టీనేజ్ పిల్లలని అటువైపుగా ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణలోని స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ ముఠా రెచ్చిపోతోంది. హైదరాబాద్‌లో మొత్తం 1000 మందికిపైగా పిల్లలు డ్రగ్స్ కు అలవాటు పడ్డారని పోలీసులు అంటున్నారు. టీనేజ్ పిల్లలనే టార్గెట్‌గా చేసుకుని వారితో డ్రగ్స్ ముఠాలోని సభ్యులు పరిచయాలు పెంచుకుని, మంచి కిక్ ఇస్తోందని నమ్మిస్తూ డ్రగ్స్‌ను అలవాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫేస్‌బుక్ ద్వారా కూడా పిల్లలకు డ్రగ్స్ ముఠా వల వేస్తోంది. పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారని అనుమానం వస్తే, వారిని వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలని డాక్టర్లు చెబుతున్నారు. యూరిన్ టెస్ట్ ద్వారా కూడా డ్రగ్స్‌కు అలవాటు పడిన పిల్లలని గుర్తించవచ్చని చెబుతున్నారు.