: భారత్, ఇజ్రాయెల్ మధ్య ఏడు కీలక ఒప్పందాలు!
భారత్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఏడు అంశాల్లో కీలక ఒప్పందాలు జరిగాయి. ఇరు దేశాల ప్రధానమంత్రుల సమక్షంలో అధికారులు ఆయా ఒప్పందాలపై సంతకాలు చేశారు. వాటిలో ముఖ్యంగా వ్యవసాయం, నీటి నిర్వహణ, భద్రత, రక్షణ, అంతరిక్షం సహా పలు రంగాల్లో సహకారంపై ఒప్పందాలు ఉన్నాయి. ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ ప్రతికూలతలను అవకాశాలుగా మార్చుకున్న దేశం ఇజ్రాయెల్ అని అన్నారు.
ఇరు దేశాల మార్గాలు వేరైనా ప్రజాస్వామ్యం, ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలు ఒక్కటేనని అన్నారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలపడ్డాయని చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహును మోదీ ఈ సందర్భంగా భారత్ కు రావాలని కోరారు. అనంతరం నెతన్యాహు మాట్లాడుతూ... వ్యవసాయం, సాంకేతికత సహా పలు అంశాలపై తాము చర్చలు జరిపినట్లు చెప్పారు. ఇండియాతో కలిసి తాము పలు రంగాల్లో చరిత్రను సృష్టించనున్నామని వ్యాఖ్యానించారు.