: విమర్శించే వారికి ఒకటే సవాలు విసురుతున్నా!: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు అనంతపురం జిల్లా ముక్తాపురంలో పర్యటిస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... ఎన్టీఆర్‌కు అత్యంత ఇష్టమైన జిల్లా అనంతపురమని అన్నారు. రాయలసీమని ఎడారిగా మారిపోయే పరిస్థితి నుంచి బయటకు తీసుకొచ్చామని అన్నారు. అనంతపురం జిల్లాలోని ఎన్నో ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని చెప్పారు. చరిత్రలో ఎన్నడూలేని విధంగా కృష్ణా డెల్టాకు సకాలంలో నీళ్లిచ్చి పంటలు కాపాడామని తెలిపారు. విమర్శించే వారికి ఒకటే సవాలు విసురుతున్నానని చంద్రబాబు నాయుడు అన్నారు. తాము పట్టిసీమను పూర్తి చేయకపోతే రాయలసీమకు ఇప్పుడు ఇన్ని నీళ్లు వచ్చేవా? చెప్పండి? అని ప్రశ్నించారు.
నదులను అనసంధానం చేయకపోతే ఇప్పుడు ఇంత ప్రయోజనం చేకూరేదా? అని అడిగారు. తాము రాష్ట్రంలోని ఇంకా ఎన్నో ప్రాంతాలకు నీళ్లు తీసుకురావాలని ప్రయత్నాలు జరుపుతున్నామని తెలిపారు. నదులలోని ఎన్నో క్యూసెక్కుల నీళ్లు ఇప్పటికీ సముద్రంలోకి వృథాగా వెళుతున్నాయని, ఆ నీటిని మన అవసరాలకు ఉపయోగించుకోవడానికి పనులు చేస్తున్నామని అన్నారు. ప్రపంచం మొత్తానికి అనంతపురం నుంచి పండ్లు, కూరగాయలు ఎగుమతి అయ్యే రోజు వస్తుందని చెప్పారు.