: పొదల మాటున, చెట్ల వెనక దుస్తులు మార్చుకునే వాళ్లం.. ప్రముఖ నటి శ్రీదేవి షాకింగ్ కామెంట్స్!
ప్రముఖ నటి శ్రీదేవి షాకింగ్ కామెంట్స్ చేసింది. గతంలో తాము షూటింగుల్లో పాల్గొనేటప్పుడు ఇప్పటిలా వ్యానిటీ వ్యాన్లు లేవని పేర్కొంది. కాబట్టి దుస్తులు మార్చుకునేందుకు లొకేషన్లలో ఉన్న పొదలు, చెట్లను ఆశ్రయించే వారమని తెలిపింది. ప్రస్తుతం తన రాబోయే చిత్రం ‘మామ్’ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న శ్రీదేవి ప్రముఖ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించింది. ఈ సినిమా కథ ప్రధానంగా దేవకి అనే తల్లి, ఆర్య అనే ఆమె కూతురు పాత్రల చుట్టూ తిరుగుతుంది.
ఈ సందర్భంగా తాను గతంలో నటించినప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంది. షూటింగ్ లొకేషన్లలో తాను మంచినీరు కూడా ముట్టేదాన్ని కాదని, సరైన వాష్ రూములు కూడా ఉండేవి కాదని గుర్తుచేసుకుంది. తనకు రెయిన్ డ్యాన్స్‌లంటే మహా చిరాకని పేర్కొంది. అలాంటి సీన్లలో నటించిన తర్వాత అనారోగ్యం పాలయ్యేదానినని తెలిపింది. శ్రీదేవి తన మరో కుమార్తె జాన్వి తెరంగేట్రంపై స్పందిస్తూ తనకు చాలా నెర్వస్‌గా ఉందని, ఎవరికైనా అలాగే ఉంటుందని పేర్కొంది. కుమార్తెల నుంచి ఫ్యాషన్‌కు సంబంధించిన సలహాలు తీసుకుంటారా? అన్న ప్రశ్నకు శ్రీదేవి స్పందిస్తూ తప్పకుండా తీసుకుంటానని బదులిచ్చింది. వారు కొత్త తరం వారని, ఏది ఫ్యాషనో వారికి బాగా తెలుసని వివరించింది.