: కొత్త సీఈసీగా అచల్ కుమార్ నియామకం
గుజరాత్ మాజీ చీఫ్ సెక్రటరి అచల్ కుమార్ జోటీని కేంద్ర ఎన్నికల అధికారి (సీఈసీ)గా నియమించారు. ఈ మేరకు న్యాయ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం సీఈసీగా ఉన్న నసీమ్ జైదీ పదవీకాలం రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త సీఈసీగా అచల్ కుమార్ జోటీని నియమించారు. 21వ సీఈసీగా అచల్ కుమార్ జోటీ ఈ నెల 6న బాధ్యతలు స్వీకరించనున్నారు.
కాగా, అరవై నాలుగు సంవత్సరాల అచల్ కుమార్ 1975 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోదీ పని చేసిన సమయంలో ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. గుజరాత్ విజిలెన్స్ కమిషనర్ గా, వివిధ హోదాల్లో ఆ రాష్ట్రంలో పని చేశారు.1999-2004 మధ్య కాలంలో కాండ్ల పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ గా, సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్ (ఎస్ఎస్ఎన్ఎన్ఎల్) మేనేజింగ్ డైరెక్టర్ గా, ఇండస్ట్రీ, రెవెన్యూ, వాటర్ సప్లై విభాగాల్లో పెద్ద హోదాల్లో ఆయన పని చేశారు. ముగ్గురు సభ్యులతో కూడిన పోల్ ప్యానెల్ లో ఎలక్షన్ కమిషనర్ గా 2015 మే 8న ఆయన చేరారు. ఇదిలా ఉండగా, మరో ఎన్నికల అధికారిని కూడా కేంద్ర ప్రభుత్వం త్వరలో నియమించనుంది. ఆ పోస్టులో ఓం ప్రకాశ్ రావత్ ను నియమిస్తారని తెలుస్తోంది.