: ఆ గ్రామాన్ని పట్టిపీడిస్తున్న మూఢనమ్మకం కారణంగా... యువకులకు పెళ్లిళ్లు కావడం లేదు!
దేశంలోని అన్ని గ్రామాల్లో అన్ని ఇళ్లలో మరుగుదొడ్డి ఉండాల్సిందేనని, స్వచ్ఛ భారత్‌గా దేశాన్ని తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంటే ఓ గ్రామం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. తమ ఇళ్లలో ఉచితంగా టాయిలెట్‌ను కట్టించినా అస్సలు ఒప్పుకోబోమని బీహార్‌లోని నవాడా జిల్లా ఘాజీపూర్ గ్రామస్తులు తెగేసి చెబతున్నారు. అందుకు అర్థంలేని ఓ కారణం కూడా ఉంది. ఆ ఊర్లోవారంతా ఓ విచిత్ర మూఢనమ్మకాన్ని గట్టిగా నమ్మేస్తున్నారు. ఇంట్లో టాయిలెట్ ఉంటే తమ ప్రాణాలకే ముప్పు వస్తుందని వారు అనుకుంటున్నారు. ఈ మూఢ నమ్మకం కారణంగా ఆ గ్రామంలోని యువకులకు పెళ్లిళ్లు కావడం లేదు. వారికి పిల్లను ఇవ్వాలని కోరితేనే అమ్మాయిల తల్లిదండ్రులు పారిపోతున్నారు.
టాయిలెట్ కట్టించుకోవాలని ఎవరైనా ఆ గ్రామవాసులకు చెబితే ఆ మాటే తమతో మాట్లాడవద్దని చెప్పేస్తారు. ప్రాణాల కంటే టాయిలెట్ ముఖ్యం కాదని, అది కనుక కట్టుకుంటే ప్రాణం గాల్లో కలిసిపోతుందని అంటున్నారు. 33 ఏళ్ల క్రితం సిద్ధేశ్వర్ సింగ్ అనే వ్యక్తి ఇంట్లో టాయిలెట్ నిర్మిస్తున్న సమయంలో ఓ అనర్థం జరిగిందట. అతడి కుమారుడికి అదే సమయంలో ఓ వింత వ్యాధి అంటుకుని చనిపోయాడట. దీంతో అప్పటినుంచి ఆ గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించుకోవడం లేదు. ఆ గ్రామంలో ఏకంగా 2 వేల మంది ఉదయాన్నే చెంబులు పట్టుకుని బయటికే వెళుతున్నారు.
గతంలో జరిగిన ఘటనను పట్టించుకోకుండా 1996లో రామ్‌పర్వేశ్ శర్మ తన ఇంట్లో టాయిలెట్ నిర్మాణం మొదలుపెట్టాడని, అదే సమయంలో అతని కొడుకుకి కూడా వ్యాధి సోకి ప్రాణాలు కోల్పోయాడని ఆ గ్రామస్తులు అంటున్నారు. టాయిలెట్ కట్టుకోవాలంటూ ఉద్యమం చేపట్టిన తమ గ్రామంలోని మరో వ్యక్తి కూడా తన కాళ్లను కోల్పోయాడని వారు పేర్కొన్నారు. అంతేకాదు, తమ ఊరి పాఠశాలలో ఉన్న టాయిలెట్ ను వాడినందుకు రెండేళ్ల క్రితం ముంద్రికా సింగ్ అనే బాలిక ప్రాణాలు కోల్పోయిందని చెప్పారు. ఈ ఘటనలు ఆ గ్రామంలో మూఢనమ్మకాన్నిగట్టిగా పెంచాయి. రాత్రి పూట మల విసర్జనకు బయటకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో ఆ గ్రామంలోని వ్యక్తులు తక్కువగా తింటున్నారు. ఈ ఘటనపై నవాడా జిల్లా మెజిస్ట్రేట్ మనోజ్‌కుమార్ స్పందిస్తూ తాను ఆ ఊరిలో ఉన్న మూఢ నమ్మకాన్ని పోగొడతానని ఆ గ్రామ వాసుల్లో చైతన్యం తీసుకువస్తానని అన్నారు.