: 'ఎండ్ దిస్ నాన్సెన్స్'... ఉత్తర కొరియా దుందుడుకుపై చైనాను కోరిన ట్రంప్
తన దూకుడును కొనసాగిస్తూ ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణిని ప్రయోగించి విజయం సాధించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఉత్తర కొరియా దుందుడుకుతనంపై చైనా కల్పించుకుని వెంటనే ఈ తరహా చర్యలను విరమించేలా చూడాలని కోరారు. "ఎండ్ దిస్ నాన్సెస్స్ వన్ అండ్ ఫర్ ఆల్" అంటూ ట్వీట్ చేశారు.
నార్త్ కొరియా అధిపతి కిమ్ జాంగ్ ఉన్ కు తన జీవితంలో చేసేందుకు మరో మంచి ఏమీ కనిపించడం లేదా? అని ప్రశ్నించిన ట్రంప్, చైనా పెద్దఎత్తున ఒత్తిడి తెచ్చి ఉత్తర కొరియాను అడ్డుకోవాల్సి వుందని అన్నారు. కాగా, నేడు ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణి, జపాన్ లోని ప్రత్యేక ఆర్థిక మండలికి సమీపంలో పడిన సంగతి తెలిసిందే. నార్త్ కొరియాకు అత్యంత సన్నిహితంగా ఉండే దేశాల్లో ఒకటైన చైనా కల్పించుకుంటే, కిమ్ జాంగ్ కాస్తంతైనా దారిలోకి వస్తాడని ట్రంప్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.