: షాకింగ్ వాస్తవాలు... హైదరాబాదు స్కూల్స్, తల్లిదండ్రులను కుదిపేస్తున్న అకున్ సబర్వాల్ ప్రకటన
హైదరాబాదులో బట్టబయలైన డ్రగ్ రాకెట్ లోతులకు వెళ్తున్నకొద్దీ జీర్ణించుకోలేని వాస్తవాలు వెల్లడవుతున్నాయి. తాజాగా తెలంగాణ ఎక్సైజ్ ఎన్ ఫోర్సుమెంట్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ చేసిన ప్రకటన హైదరాబాదులోని గొప్పవని పేరొందిన అన్ని స్కూల్స్ లో పెను కలకలం రేపుతుండగా, విద్యార్థుల తల్లిదండ్రుల్లో హార్ట్ బీట్ పెంచుతున్నాయి. డ్రగ్ మాఫియా స్కూల్ పిల్లల్ని లక్ష్యంగా చేసుకుందని ఆయన అన్నారు. ప్రస్తుతానికి డ్రగ్స్ బారిన పడిన 1,275 మంది స్కూల్ విద్యార్థుల కాంటాక్ట్స్ తమ దగ్గర ఉన్నాయని ఆయన వెల్లడించారు.
డ్రగ్స్ వినియోగించే 200 వాట్స్ యాప్, టెలిగ్రాం గ్రూప్స్ ను గుర్తించినట్టు ఆయన తెలిపారు. ఒకే స్కూల్ కు చెందిన 20 మంది విద్యార్థులు డ్రగ్ అడిక్ట్స్ గా మారారని ఆయన చెప్పారు. అయితే ఫియర్ ఫేసింగ్ వల్ల విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలయ్యారని ఆయన పేర్కొన్నారు. మొత్తం స్టూడెంట్స్ అందరి వివరాలు ఆయా స్కూల్ ప్రిన్సిపల్స్ కు అందించామని ఆయన చెప్పారు. పోలీసులు పొరపాటున కూడా విద్యార్థులు పేర్లు లేదా జాబితా విడుదల చేయరని ఆయన స్పష్టం చేశారు. డ్రగ్స్ వ్యవహారం బట్టబయలైందని విద్యార్థులెవరూ అఘాయిత్యాలకు పాల్పడొద్దని, డ్రగ్స్ అందడం లేదని ఆత్మహత్యలకు పాల్పడకూడదని, కుటుంబ సభ్యులతో చర్చించి సాంత్వన పొందాలని, అలాగే ఈ ఉచ్చునుంచి బయటపడాలని ఆయన సూచించారు.
కాగా, ఈ కేసులో తాజాగా మరోనలుగురు ఎంఎన్సీ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. వారి నుంచి 100 ప్యాకెట్ల ఎల్ఎస్డీ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. నిందితులు సాఫ్ట్ వేర్ కంపెనీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు గుర్తించామని, అరెస్టైన నలుగురిలో ఇద్దరు అత్యున్నత స్థాయి సాఫ్ట్ వేర్ ఉద్యోగులని, దీంతో వారి గురించి మరింత సమాచారం సేకరిస్తున్నామని ఆయన తెలిపారు.