: ఇంటి నుంచి భర్త గెంటేశాడని కేసు పెట్టిన బాలీవుడ్ నటి
బాలీవుడ్ నటి, మోడల్, 'బిగ్బాస్-9' కంటెస్టెంట్ మందనా కరీమి (ఇరాన్) తన భర్త గౌరవ్ గుప్తాపై 498 (ఏ) (గృహ హింస) కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ, 'ఏడువారాల కిందట మా అత్తవారి ఇంటి నుంచి నన్ను వెళ్లగొట్టారు. వారితో రాజీ చేసుకునేందుకు నేను ఎంతగానో ప్రయత్నించాను. అయినా మా అత్తావాళ్లు నన్ను తిరిగి ఇంట్లోకి రానివ్వలేదు. గౌరవ్ కూడా నాతో సంబంధాలు తెంపుకున్నాడు' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
గత జనవరి 25న మందన, గౌరవ్ వివాహం చేసుకున్నారు. ఆరు నెలలు కూడా తిరక్కుండానే వారి మధ్య విభేదాలు పొడసూపాయి. ఈ నేపథ్యంలో వివాహానికి ముందే హిందూమతంలోకి మారాలంటూ తనను మానసికంగా వేధించి క్షోభకు గురిచేశాడని, వివాహానంతరం మోడలింగ్, నటనకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశాడని, అభ్యంతరమేంటని అడిగితే ఆ వృత్తి సమాజంలో తమ కుటుంబ హోదాకు భంగం కలిగిస్తుందని చెప్పాడని ఆమె తెలిపింది. తనను వేధింపులకు గురి చేసి, తన కెరీర్, బిజినెస్ కు నష్టం కలిగించినందుకు 2 కోట్ల రూపాయల పరిహారం ఇవ్వాలని, తన జీవన వ్యయానికి గాను ప్రతినెలా పది లక్షల రూపాయలు ఇవ్వాలని అంధేరి మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్పందించేందుకు గౌరవ్ పీఆర్ నిరాకరించారు. కాగా, మందన 'క్యా కూల్ హై హమ్' వంటి సినిమాల్లో నటించింది.