: అప్పుడు, మనోజ్, నేను బిచ్చగాళ్లుగా మారాం: సినీ నటుడు ఆది పినిశెట్టి
తాను, మంచు మనోజ్ ఫ్రాన్స్ లో తెలుగు పాటలు పాడుతూ టోపీలు ముందు పెట్టుకుని కూర్చుని బిచ్చగాళ్లుగా మారిపోయామంటూ ప్రముఖ హీరో, ఒకప్పటి ప్రముఖ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది నాడు జరిగిన ఓ సరదా సంఘటనను గుర్తుచేసుకున్నాడు. మనోజ్, తాను ప్రాణస్నేహితులమని చెప్పిన ఆది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అతనితోనే తాను క్లోజ్‌గా ఉంటానని చెప్పాడు. ఈ సందర్భంగా చిన్నప్పుడు జరిగిన ఓ సరదా సంఘటన గురించి చెప్పాడు.
తన తండ్రి రవిరాజా పినిశెట్టి డైరెక్షన్లో మోహన్‌బాబు కొన్ని సినిమాలు చేశారని, ఆ సమయంలో ఓ సినిమా షూటింగ్ కోసం మోహన్‌బాబు కుటుంబంతో కలిసి, తమ ఫ్యామిలీ కూడా ఫ్రాన్స్‌కు వెళ్లిందని చెప్పాడు. పారిస్‌లో ఓ చోట షూటింగ్ జరుగుతున్నప్పుడు తాను, మనోజ్ కలిసి ఎవరికీ చెప్పకుండా ఓ బస్సు ఎక్కి వేరే చోటుకి వెళ్లామని, తిరిగి షూటింగ్ జరిగిన ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ ఎవరూ లేకపోవడంతో తమకు చాలా భయమేసిందని, జేబులో డబ్బులు కూడా లేవని చెప్పాడు. అక్కడ అందరూ ఫ్రెంచ్ భాషలోనే మాట్లాడేవారు ఉండటంతో తమకు ఏం చేయాలో తెలియలేదన్నాడు. చివరకు నది వంతెన వద్ద తెలుగు పాటలు పాడుతూ టోపీలు ముందు పెట్టుకుని కూర్చుని బిచ్చగాళ్లుగా మారిపోయామని, కొంతమంది డబ్బులు వేయడంతో ఆ డబ్బులతో బస్ ఎక్కి తమ వాళ్లను చేరుకున్నామని ఆది చెప్పుకొచ్చాడు.