: విస్తుపోయే వాస్తవం... ఖరీదైన ఫోన్ పోయిందని ఇంట్లో చెప్పి, తక్కువ ధరకు అమ్మేసి, డ్రగ్స్ కొంటున్న స్టూడెంట్స్!
తమ బిడ్డకు ప్రేమతో ఖరీదైన ఫోన్ కొనిస్తే, అది పోయిందని చెప్పాడని, మరోటి కొనిస్తే, అదీ పోయిందని చెప్పాడని, తీరా ఇప్పుడు వాటిని తక్కువ ధరకు అమ్మి డ్రగ్స్ కొని వాడుతున్నాడని తెలుసుకుని మనసు విలవిల్లాడి పోతోందని ఓ బాలిక తల్లి తన ఆవేదనను వ్యక్తం చేసింది. రూ. 15 వేల విలువైన ఫోన్ ను రూ. 3 వేలకు అమ్మి డ్రగ్స్ కొన్నట్టు తెలిసిందని, ఓ తల్లిగా ఇంతకన్నా బాధ ఏంటని ప్రశ్నించింది.
చదువుకునే పిల్లలను టార్గెట్ చేసి మత్తుమందులకు అలవాటు చేస్తున్న కెల్విన్ లాంటి వ్యక్తులను ఎంతమాత్రమూ వదల కూడదని, అతనికి కఠిన శిక్ష పడాల్సిందేనని చెప్పుకొచ్చింది. హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ దందా కేసులో భాగంగా, విచారిస్తున్న పోలీసులు మరిన్ని విషయాలను తెలుసుకుంటున్నారు. మత్తుమందులను విదేశాల నుంచి తెప్పించి అమ్ముతుంటే, వీరికి ఖాతాదారులుగా ఎంతో మంది హై ప్రొఫైల్ తల్లిదండ్రుల పిల్లలు ఉన్నారని పోలీసులు అంటున్నారు.