: మహిళల క్రికెట్ పై వ్యాఖ్యలు.. చిక్కుల్లో పడ్డ వకార్ యూనిస్
నిప్పులు చెరిగే బంతులతో ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాట్స్ మెన్ ను వణికించిన పాకిస్థాన్ మాజీ స్పీడ్ స్టర్ వకార్ యూనిస్ చిక్కుల్లో పడ్డాడు. ప్రపంచ కప్ లో మహిళల క్రికెట్ మ్యాచ్ లకు ఓవర్లను కుదించాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. వకార్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ మహిళల పట్ల వివక్షాపూరితంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివాదం వివరాల్లోకి వెళ్తే, మహిళల ప్రపంచకప్ లో ఇరు జట్ల ఓవర్లను 30 లేదా 20కి కుదించాలని వకార్ అభిప్రాయపడ్డాడు. అయితే, ఏ ఉద్దేశంతో ఈ ప్రతిపాదన చేశాడో ట్విట్టర్లో ఆయన వివరించలేదు. దీంతో, ప్రపంచ అగ్రశేణి బౌలర్లలో ఒకడిగా పేరుగాంచిన వకార్ పై ఆయన అభిమానులు సైతం విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో, చివరకు ఆయన సంజాయషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల శక్తిని కించపరచడం కాదని... తక్కువ ఓవర్లు ఉంటే, ఆడియన్స్ కూడా పెరుగుతారనేదే తన ఉద్దేశమని వకార్ వివరణ ఇచ్చాడు. మహిళల పట్ల తనకు చిన్నచూపు లేదని తెలిపాడు.